రియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మిస్ ఫరెవర్ యూనివర్స్ ఇండియా’ విజేత డాక్టర్ సృజన దేవి జన్మదిన వేడుకలు

విశాఖపట్నం, ఏప్రిల్ 21: నగరంలోని మద్దిలపాలెం హెచ్‌బి కాలనీలో గల ‘ఐశ్వర్య గ్రాండ్’ మినీ థియేటర్స్ హబ్ లో మిస్ ఫరెవర్ యూనివర్స్ ఇండియా (Miss Forever Universe India) విజేత డాక్టర్ సృజన దేవి జన్మదిన వేడుకలు రియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆడంబరాలకు తావు లేకుండా, సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా రియా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎండి రాజు చేతుల మీదుగా కేక్ కట్ చేసి డాక్టర్ సృజన దేవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా ఆమె ఫోటో ఫ్రేమ్‌ను బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రియా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ ఎండి రాజు మాట్లాడుతూ: “డాక్టర్ సృజన దేవి కేవలం గ్లామర్ రంగంలోనే కాకుండా, వృత్తిరీత్యా వైద్యురాలిగా (అనస్థీషియాలజిస్ట్) నిరంతరం సమాజ సేవలో ఉండటం అభినందనీయం. పట్టుదలతో మిస్ ఫరెవర్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సాధించిన ఆమె, యువతకు, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఒక గొప్ప స్ఫూర్తిప్రదాత. సృజన దేవి అందంలోనే కాదు, సేవా దృక్పథంలోనూ ముందుండటం గర్వకారణం” అని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన దేవి మాట్లాడుతూ “ప్రతి పుట్టినరోజు మనకు సమాజం పట్ల ఉండాల్సిన కొత్త బాధ్యతను గుర్తుచేస్తుంది. రియా ఫౌండేషన్ వంటి సేవా సంస్థల ద్వారా తోటి వారికి సాయం అందించడాన్ని నా విజయానికి దక్కిన అతిపెద్ద బహుమతిగా భావిస్తున్నాను. వైద్యురాలిగా, సామాజిక కార్యకర్తగా నా వంతు బాధ్యతను ఎల్లప్పుడూ కొనసాగిస్తాను,” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐశ్వర్య గ్రాండ్ పార్టీపల్స్ మినీ థియేటర్ అధినేతలు సీనియర్ జర్నలిస్టు తిలక్, షేక్ బాషా, దివాకర్, SG మీడియా చైర్మెన్ శ్రీనివాసరావు, జర్నలిస్ట్లు ,శ్రీ లత,రాధాకృష్ణ, ప్రేమ్ కుమార్,రియా ఫౌండేషన్ సభ్యులు, పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొని డాక్టర్ సృజన దేవికి శుభాకాంక్షలు తెలియజేశారు.




