సాగర్ నగర్‌లో ఘనంగా “మదర్సా-ఎ-అమన్” ప్రారంభోత్సవం ఆధ్యాత్మికతతో పాటు విద్యాభివృద్ధికి నూతన వేదిక

విశాఖపట్నం, ఏప్రిల్ 17(ట్రూ న్యూస్ ) :విశాఖపట్నం నగరంలోని సాగర్ నగర్ ప్రాంతంలో మస్జిద్-ఎ-అమన్ ప్రాంగణంలో “మదర్సా-ఎ-అమన్” ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం మతపరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో, సమాజ సేవా స్పూర్తితో, పెద్ద ఎత్తున ప్రజల సమక్షంలో నిర్వహించబడింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు జనాబ్ ఐ హెచ్ ఫారూఖి, 53వ వార్డు మాజీ కార్పొరేటర్ జనాబ్ బర్కత్ అలీ, 66వ వార్డు మాజీ కార్పొరేటర్ జనాబ్ ఇమ్రాన్ సంయుక్తంగా ప్రారంభించి మదర్సా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో విద్యా ప్రగతితో పాటు నైతిక విలువలను పెంపొందించడంలో మదర్సాల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంవీపీ కాలనీ అల్-మదీనా మస్జిద్ ముఫ్తీ జనాబ్ అబ్దుల్ ఖయ్యూం సాహెబ్ తన ప్రసంగంలో మదర్సాల అవసరాన్ని విశదీకరించారు. యువతలో ఇస్లామిక్ విద్యతో పాటు సాంప్రదాయ మరియు ఆధునిక విద్య కలగలిపి అందించడం ద్వారా సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. మదర్సాలు కేవలం మతపరమైన విద్యకే పరిమితం కాకుండా, మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతల పెంపొందింపులో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సిపి మైనారిటీ సెల్ జెనరల్ సెక్రటరీ, మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి కె వి బాబా,అల్-హజ్ అహ్మదుల్లా ఖాన్, తారా మస్జిద్ అధ్యక్షులు ఎంఏ రజాక్, అల్-మదీనా మస్జిద్ అధ్యక్షులు జనాబ్ రాహీ , డాక్టర్ ఖాదర్ బాబా, మహమ్మదియా మస్జిద్ కార్యదర్శి గులామ్ ముస్తఫా తదితర ప్రముఖులు పాల్గొని మదర్సాల ప్రాముఖ్యత, సమాజంలో వాటి అవసరం, విద్యా సేవల విస్తరణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మస్జిద్-ఎ-అమన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత సమన్వయంతో నిర్వహించబడింది. అధ్యక్షుడు జనాబ్ అబ్దుల్ ఖుద్దూస్, కార్యదర్శి జనాబ్ అల్లా బక్షి,కోశాధికారి అమీన్, ఉపాధ్యక్షులు సయ్యద్ గౌస్,షానవాజ్, అమీర్ మరియు కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. వారి కృషిని హాజరైన అతిథులు ప్రత్యేకంగా అభినందించారు.
విశాఖపట్నం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి, పలు మస్జిద్‌లకు చెందిన భక్తులు, యువత, పెద్దలు కలిసి సుమారు 600 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని మదర్సా ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహంతో, సోదరభావంతో నిండిపోయింది.
చివరిగా జగదాంబ ప్రాంతంలోని మక్కా మస్జిద్‌కు చెందిన హఫీజ్-ఎ-ఖురాన్ హాజీ బసిరుల్ ఖాద్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మదర్సా-ఎ-అమన్ విజయవంతంగా కొనసాగాలని, విద్యా సేవలు మరింత విస్తరించాలని, సమాజానికి మరింత సేవ చేయాలని ప్రార్థించారు. అదనంగా, ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ ముస్లిం మైనార్టీ నాయకులు ముస్తఫా బోరా, కమ్యూనిటీ ప్రతినిధులు ముస్తఫా జోహార్, అబిజర్, సీనియర్ న్యాయవాది చింతపల్లి రాంబాబు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మదర్సా-ఎ-అమన్ ప్రారంభంతో సాగర్ నగర్ ప్రాంతంలో విద్యాపరమైన సేవలకు కొత్త దిశ లభించినట్లు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మికతతో కూడిన విద్య అందించే ఒక ప్రముఖ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.




