విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదం అత్యంత విషాదకరం : వైఎస్ జగన్

తాడేపల్లి /విశాఖపట్నం/జూన్ 8(ట్రూ న్యూస్ ) : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.స్టీల్ మెల్టింగ్ షాప్-2 (ఎస్‌ఎంఎస్-2)లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.




