రిజర్వేషన్లలో రాజకీయ జోక్యం సహించం! నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులే బాధ్యత వహించాలి – చట్టపరంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడుతాం: కెకె రాజు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు

విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలో వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిగా ప్రభుత్వ చట్టాలు, ఎన్నికల నిబంధనలు, అధికారిక మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకె రాజు డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ల ప్రక్రియలో రాజకీయ జోక్యానికి ఎలాంటి తావు ఉండకూడదని, అధికారులు కేవలం చట్టబద్ధమైన విధానాలను మాత్రమే అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేదా ఇతర రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడి ఎవరికైనా అనుకూలంగా రిజర్వేషన్లను మార్చే ప్రయత్నాలు జరిగితే వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. నాయకులు వస్తుంటారు… వెళుతుంటారు. కానీ అధికారులు తమ పదవుల్లో ఉన్నంతకాలం రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజలకు, రాజ్యాంగానికి, చట్టానికి జవాబుదారులుగా వ్యవహరించాలి” అని కెకె రాజు పేర్కొన్నారు. రిజర్వేషన్లు వ్యక్తులు, రాజకీయ నాయకులు లేదా ఏదైనా పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, ప్రభుత్వం నిర్దేశించిన చట్టబద్ధమైన ప్రమాణాలు, అధికారిక జనాభా గణాంకాలు, ఓటర్ల వివరాలు, సామాజిక వర్గాల గణాంకాలు, మహిళా ఓటర్ల వివరాలు తదితర అధికారిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఇప్పటికే GVMC పరిధిలో 120 వార్డుల విభజనకు సంబంధించిన వివరాలను అధికారికంగా విడుదల చేసిన నేపథ్యంలో, ప్రతి వార్డుకు సంబంధించిన జనాభా, ఓటర్ల సంఖ్య, మహిళా ఓటర్లు, బి.సి , ఎస్.సి , ఎస్.టి , తదితర సామాజిక వర్గాలకు సంబంధించిన అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లను చట్టబద్ధంగా ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల తుది ప్రకటనకు ముందు సంబంధిత వివరాలను ప్రజలకు పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని, ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ కేటాయించబడుతుందనే అంశంలో ముందస్తు నిబంధనలు, అధికారిక గణాంకాలు స్పష్టంగా ఉండాలని కోరారు. ఇప్పటికే విడుదల చేసిన అధికారిక గణాంకాలు, నిబంధనలకు భిన్నంగా రిజర్వేషన్లను రూపొందించే ప్రయత్నాలు జరిగితే వాటిని తీవ్రంగా ప్రశ్నిస్తాం. రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా రిజర్వేషన్లలో మార్పులు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని కెకె రాజు అన్నారు.
కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్‌లు చేసి తమకు అనుకూలంగా వార్డుల రిజర్వేషన్లను ఖరారు ఆయీ అని చెప్పుతూ వారి ఎన్నికలలు సిద్దం ఉండాలి అని కూటమి ప్రభుత్వం నాయుకులు ప్రయత్నిస్తున్నారనే సమాచారం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అధికారిక ప్రక్రియలో రాజకీయ జోక్యం జరిగితే అది అప్రజాస్వామికంగా మారుతుందని, రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ఇటీవల వార్డుల డీలిమిటేషన్ విషయంలో కూడా పరిపాలనా సౌలభ్యం, ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని కెకె రాజు పేర్కొన్నారు. అదే విధంగా రిజర్వేషన్ల విషయంలో కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల తరఫున చట్టబద్ధమైన, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తామని తెలిపారు.
అధికారులు తమ అధికారాలను ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో సంబంధిత నిర్ణయాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. తప్పులు జరిగితే వాటిపై చట్టపరమైన చర్యలు కోరడంతో పాటు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తాం అని కెకె రాజు హెచ్చరించారు. అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావు… కానీ రాజ్యాంగం, చట్టాలు శాశ్వతం. రాజకీయ నాయకుల ఆదేశాల కంటే రాజ్యాంగం, ఎన్నికల నిబంధనలు, ప్రజల ప్రయోజనాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలి. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు, రాజకీయ జోక్యానికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాం అని కెకె రాజు స్పష్టం చేశారు.




