మతం

చెల్లాపురంలో వైభవంగా గ్యార్మీ షరీఫ్   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫారుఖి, బర్కత్ అలీ  

విశాఖపట్నం సిటీ, అక్టోబరు 11 (ట్రూ న్యూస్ ) : సూఫీ ఆధ్యాత్మిక గురువు హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ బోధించిన సత్యమార్గం, క్రమశిక్షణ, దైవభక్తిని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని ఉత్తరప్రదేశ్కు చెందిన హజ్రత్ అల్లామా ముఫీ అహ్మద్ షాహెద్ ముజద్దీన్ పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం చెల్లాపురం గ్రామంలో ఆదివారం గ్యార్మీ షరీఫ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆధ్యాత్మిక సభలో ఆయన ప్రసంగించారు. ఇస్లాంలో ప్రముఖ సూఫీ గురువుగా, పండితుడిగా పేరొందిన హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ (గౌస్ ఆజం) స్మృత్యర్థం గ్యార్మీ షరీఫ్ నిర్వహిస్తారని వివరించారు. ఇస్లామిక్ హిజ్రి క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల 11వ తేదీన, ముఖ్యంగా రబీ ఉల్ ఆఖిర్ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. ‘గ్యార్మీ’ అంటే పదకొండు, ‘షరీఫ్’ అంటే గౌరవప్రదమైనదని పేర్కొన్నారు. హజ్రత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ పేదలకు ఆహారం పంపిణీ చేసే సంప్రదాయాన్ని అనుసరించేవారని, ఈ ఆహారాన్ని నియాజ్ లేదా తబరుక్ గ పేర్కొంటారని వివరించారు. ఆయన అనంతరం శిష్యులు, భక్తులు ఆయన స్మరణార్థం ఇసాలె సవాబ్ సంప్రదాయంలో భాగంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యుడు ఐహెచ్ ఫరూఖీ, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు బర్కత్ అలీ మాట్లాడుతూ గ్యార్మీ షరీఫ్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చెల్లాపురం గ్రామ ముస్లిం పెద్దలకు, సోదర సోదరీమణులకు సలాం తెలియజేశారు. అనంతరం సలాతు సలాం, ఫాతేహా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు హజ్రత్ గౌస్ ఆజం సర్కార్ జెండాను ఆవిష్కరించారు. భక్తులకు తబర్రుక్ పంపిణీ చేసేందుకు గ్రామ ముస్లిం పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!