రాజకీయాలురాష్ట్రం

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ కన్నుమూత

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

వయసురీత్యా 90 సంవత్సరాలు ఉన్న ఆయన అనారోగ్యం కారణంగా గత ఆరు నెలల నుంచి అస్వస్థతకు గురయ్యారు. 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాదెండ్ల ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్‌రావు జన్మించారు.

1978లో విజయవాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చెన్నారెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు భాస్కర్‌రావు.1984 ఆగష్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం 31 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా నాదెండ్ల పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర చరిత్రలో అత్యల్పకాలం ముఖ్యమంత్రిగా నాదెండ్ల నిలిచారు. 1985లో ప్రజాస్వామ్య తెలుగు దేశం పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

ఆపై కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాదెండ్ల 1989లో తెనాలి నుంచి పోటీ చేసి అన్నాబత్తుని సత్యనారాయణపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి భాస్కర్ రావు గెలుపొందారు. నాదెండ్ల భాస్కర్ రావు మృతిపట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రేపు(గురువారం) సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!