సచివాలయం ఉద్యోగులపై ప్రభుత్వ నిర్బంధం ఆపాలి సిఐటియు

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చేస్తున్న ఆందోళనకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం జగదాంబ సిఐటియు ఆఫీసు నుంచి ప్రదర్శనగా వెళ్లి జగదాంబ జంక్షన్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నరసింగరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకుండా వారిపై నిర్బంధం ప్రయోగించి వారి పోరాటాలను అనచాలని ప్రయత్నిస్తుందన్నారు. గత అనేక సంవత్సరాల నుండి వివిధ సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకొని వెళ్లి చట్టబద్ధంగా వారికి రావలసిన హక్కులను అడుగుతూ ఉంటే వాటిని అమలు చేయకుండా వారితో వెట్టి చాకిరీ చేయిస్తుందన్నారు. రాష్ట్రంలో కోట్లాదిమంది ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయడంలో సచివాలయ సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారు. అటువంటిది వారికి రావలసిన ప్రమోషన్లు, నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు, బకాయి ఉన్న తొమ్మిది నెలల ఏరియర్స్ చెల్లించాలని, పని భారం తగ్గించాలని, వేధింపులు ఆపాలని కోరుతూ ఉంటే వారి యొక్క సమస్యలు పరిష్కరించకుండా వారిపై నిర్బంధం ప్రయోగించడం అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. నిన్న విజయవాడలో ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉంటే ధర్నాకు అనుమతి లేదని బలవంతంగా మహిళలని చూడకుండా ఈడ్చుకొని వెళ్లి అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించి కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. విజయవాడలో ధర్నా చేయడానికి అనుమతి కోరితే ఇవ్వకుండా ప్రభుత్వం నిరాకరించిందన్నారు. బందోబస్తులో ఉన్నటువంటి పోలీస్ సిఐ గుండెపోటుతో మరణిస్తే ఆ మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఆ కేసును సచివాలయ సిబ్బంది నాయకులపై మోపాలని కుట్ర పండుతుందన్నారు. ఇప్పటికే 46 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేశారన్నారు. తక్షణమే అరెస్ట్ అయిన వారినందరినీ విడుదల చేయాలని, తప్పుడు కేసులు ఎత్తివేయాలని, సచివాలయ సిబ్బంది యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. పోరాడుతున్న సచివాలయ సిబ్బందికి సిఐటియు అండగా ఉంటుందని తెలియజేశారు. అరెస్టులతో, అక్రమ కేసులతో, నిర్బంధాలతో ఉద్యమాలను అణచాలనుకుంటే అంతకంటే అవివేకం ఉండదన్నారు. ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితోపాటు సిఐటియు జిల్లా నాయకులు ఆర్కే ఎస్ వి కుమార్, పి మని, యు రాజు, పి వెంకట్రావు, టీ నూకరాజు, ఎం సుబ్బారావు, సుభాషిని, కుమారి, గణేష్, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.




