విశాఖ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కంకణబద్ధుడినై పనిచేస్తా.బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్

ఏప్రిల్ 01 ః విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కంకణబద్దుడినై పని చేస్తానని, ప్రతి పథకం నిజమైన లబ్ధిదారులకు చేరేలా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. నూతన కలెక్టర్ గా బుధవారం మధ్యాహ్నం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా సమగ్ర అభివృద్ధి తన ప్రాధాన్యతగా ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశానికి కూడా కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నగరమని అన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి కట్టుబడి ఉన్నానన్నారు. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమలు, డేటా సెంటర్లు, టూరిజం రంగాల్లో మరింత పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమతుల్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా శాయశక్తులా పని చేస్తానని ఉద్ఘాటించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకుని వేగంగా పరిష్కరించడం తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ప్రాంతాన్ని సందర్శించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తానని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం, పోర్టు ఆధారిత అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ వంటి అంశాలు విశాఖపట్నం అభివృద్ధికి కొత్త దిశను తీసుకువస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాలను సమర్థంగా వినియోగించుకుని జిల్లాను రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేస్తూ పారదర్శకత, సమర్థతతో పరిపాలన అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి ప్రయాణంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని, అందరూ కలిసి విశాఖపట్నాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తాను ఆంధ్రావాడినేనని, తన స్వస్థలం నెల్లూరు అని, అమ్మానాన్నా ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే అని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు వివిధ హోదాల్లో సేవలందించానని, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో సబ్ కలెక్టర్ గా, ఐటీడీఏ పీవోగా, మున్సిపల్ కమిషనర్ గా, జాయింట్ కలెక్టర్ గా పని చేసినట్లు వివరించారు. అలాగే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా, ఫైనాన్స్, కమిర్షియల్ టాక్స్, ఇండస్ట్రీస్ విభాగాల్లో సేవలందించానని చెప్పారు. విశాఖ జిల్లాకు రావటం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా అని అభిషిక్త్ కిశోర్ అన్నారు.




