విశాఖపట్నం

అంతర్జాతీయ పర్యాటక పటంలో విశాఖకు సముచిత స్థానం ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం ‘వైజాగ్ వేవ్స్’ వేడుకలు

  • పర్యాటక, ఐటీ, వైద్య రంగాల హబ్‌గా నగరాభివృద్ధి: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి
  •   ​రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకుల్లో 85% విశాఖకే: జిల్లా కలెక్టర్
  • ​నగరంలో రూ. 4,000 కోట్ల అభివృద్ధి పనులు, బీచ్ రోడ్డు విస్తరణ: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

​విశాఖపట్నం (సెప్టెంబర్ 27): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ, జీవీఎంసీ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని సిరిపురం ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఆదివారం సాయంత్రం ‘వైజాగ్ వేవ్స్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.

 

భవిష్యత్తంతా టూరిజానిదే: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి

​ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా  బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు విశాఖ నగరం అంటే ఎంతో మక్కువ అని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు ఏజెన్సీ అందాల నుంచి అనకాపల్లి బౌద్ధ క్షేత్రాల వరకు పర్యాటకంగా అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖను ఐటీ, మెడికల్ టూరిజం, బీచ్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వివరించారు. “ఏ ఇజం లేదు.. భవిష్యత్తంతా టూరిజం” అనే నినాదంతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నూతన విధానాలతో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామని, విశాఖను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

​ఇటలీ అమాల్ఫీ కోస్ట్‌తో సమానమైన అందాలు: జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్

​జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ తిరుమల మినహా రాష్ట్రంలో అత్యధిక పర్యాటక కార్యకలాపాలు విశాఖలోనే జరుగుతున్నాయని, రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకుల్లో 85 శాతం మంది వైజాగ్‌నే సందర్శిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నగరంలో 10కి పైగా ఫైవ్‌స్టార్ హోటళ్లు నిర్మాణంలో ఉన్నాయని, మేఫెయిర్, ఒబెరాయ్ వంటి సంస్థలు సెవెన్-స్టార్ వసతులతో ప్రాజెక్టులు చేపడుతున్నాయని పేర్కొన్నారు. వెస్టిన్, మారియట్, తాజ్ వంటి అంతర్జాతీయ సంస్థలు కొత్త హోటళ్లను నిర్మిస్తున్నాయని చెప్పారు. అమెరికా పర్యటనలో అంతర్జాతీయ పెట్టుబడిదారులు, నిపుణులు విశాఖను ఇటలీలోని సుప్రసిద్ధ ‘అమాల్ఫీ కోస్ట్’తో పోలుస్తూ, అత్యంత అందమైన మరియు పరిశుభ్రమైన నగరంగా ప్రశంసించారని కలెక్టర్ గుర్తుచేశారు.

  • ​అంతర్జాతీయ పర్యాటక ఫెయిర్లలో విశాఖకు విస్తృత ప్రచారం: సీపీ శంఖబ్రత బాగ్చి

​నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ విశాఖ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచిందని పేర్కొన్నారు. స్వదేశీ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనలలో (Tourism Fairs) విశాఖ బీచ్ టూరిజంను ప్రత్యేకంగా ప్రమోట్ చేయాలని సూచించారు. నూతన ఎయిర్‌పోర్ట్, మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ ద్వారా అంతర్జాతీయ పర్యాటక పటంలో విశాఖను అగ్రగామిగా నిలపవచ్చని అభిప్రాయపడ్డారు.

  • పర్యాటక మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట: ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

​విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగర అభివృద్ధి కోసం రూ. 4,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. కైలాసగిరికి రెండో రోడ్డు నిర్మాణం, పార్కింగ్ సదుపాయాల పెంపు, తొట్లకొండ అభివృద్ధి పనులు ఇందులో భాగమని వివరించారు. దేశంలోనే అత్యంత పొడవైన బీచ్ కారిడార్ విశాఖ సొంతమని, జోడుగుళ్ళపాలెం నుంచి భీమిలి వరకు 200 అడుగుల ఫోర్-లేన్ బీచ్ రోడ్డు పనులను డిసెంబర్ నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

  • ​విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు

​ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో అత్యధిక పర్యాటకులను ఆకర్షిస్తున్న ఏకైక నగరం విశాఖ అని తెలిపారు. విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం టీసీఎస్ (TCS) మరియు గూగుల్ డేటా సెంటర్ వంటి సంస్థలను నగరానికి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. పారిశ్రామిక, ఐటీ అభివృద్ధి వేగవంతమైతే ఆర్థిక లావాదేవీలు పెరిగి పర్యాటక రంగం దానంతటదే విస్తరిస్తుందని చెప్పారు.

  • ​పర్యాటకుల సౌకర్యార్థం జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు: కమిషనర్ కేతన్ గార్గ్

​జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ పర్యాటక సీజన్ ప్రారంభమైన దృష్ట్యా నగరంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. గతంలో ప్రారంభించిన హాప్-ఆన్ హాప్-ఆఫ్ బస్సు సేవలతో పర్యాటక ప్రాంతాల అనుసంధానం సులభతరమైందని తెలిపారు. ఇదే వేదికపై 40-50 దేశాలు పర్యటించిన ముగ్గురు విశేష యాత్రికులను (Travelers) అధికారులు ఘనంగా సత్కరించారు. అనంతరం స్థానిక కళాకారుల స్కిట్, లైవ్ బ్యాండ్ సంగీత విభావరి, ఓపెన్ మైక్ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి.

​ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ DVM జగదీష్ DTO మాధవి, జీవీఎంసీ అధికారులు, నగర ప్రముఖులు మరియు పెద్ద ఎత్తున యువత,ప్రజలు పాల్గొన్నారు. వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టు కున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!