విశాఖపట్నం

వైజాగ్‌లో అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ బన్నీ చేతుల మీదుగా ఏఏఏ మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్

  • బన్నీ రాకతో వైజాగ్‌లో సందడి
  • అల్లు అర్జున్‌ను చూసేందుకు పోటెత్తిన అభిమానులు 
  • 8 స్క్రీన్స్‌తో ఏఏఏ మల్టీప్లెక్స్ ప్రారంభం
  • విశాఖ సినీ ప్రేక్షకులకు సరికొత్త వినోద అనుభూతి
  • బన్నీ రాకకు విశాఖ పోలీసులు భారీ భద్రత
  • సీపీ, డీసీపీ-1, ఏసీపీలు,సీఐ పోలీసు అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ
  • అభిమానుల సందడి.. పోలీసుల పటిష్ట బందోబస్తు
  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు

విశాఖ// ఆగస్టు 9 విశాఖ నగరంలో సినీ వినోదరంగానికి మరో కొత్త ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. కైలాసపురం పరిధిలోని సాలిగ్రామపురంలో ఇనార్బిట్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఏఏఏ మల్టీప్లెక్స్ థియేటర్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. మొత్తం 8 స్క్రీన్స్‌తో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ విశాఖ సినీ ప్రేక్షకులకు సరికొత్త వినోద అనుభూతిని అందించనుంది.ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖపట్నంలో నూతన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమన్నారు. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందాలని, ఏఏఏ సినిమాస్ కూడా విశాఖలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.విశాఖపట్నంతో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని అల్లు అర్జున్ తెలిపారు. ‘గంగోత్రి’ సినిమా షూటింగ్ సమయంలో విశాఖ నగరంలోని రోడ్లపై తిరిగేవాడినని, అప్పట్లో తనను ఎవరూ గుర్తుపట్టేవారు కాదని, ప్రస్తుతం అభిమానుల ప్రేమ కారణంగా అలా స్వేచ్ఛగా తిరగలేకపోతున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. విశాఖలో ఏఏఏ థియేటర్‌ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రయాణంలో తన భార్య స్నేహ అందించిన సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ప్రస్తుతం ‘రాకా’ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోందని, ఈ కార్యక్రమం కోసం విశాఖకు వచ్చానని తెలిపారు.

అభిమానుల అభ్యర్థన మేరకు కొందరిని వేదికపైకి పిలిపించి అల్లు అర్జున్ వారితో ఫొటోలు దిగారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. బన్నీ రాక విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో ఇనార్బిట్ మాల్ వద్దకు తరలివచ్చారు. పలువురు అభిమానులు బైక్‌లపై భారీగా రావడంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కార్యక్రమం ముగిసిన అనంతరం అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుండగా మార్గమధ్యంలో అభిమానులకు అభివాదం చేశారు.

ఒకే చోట 8 స్క్రీన్స్.. కుటుంబ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి

విశాఖలో ఇనార్బిట్ మాల్‌లో ఒకే ప్రాంగణంలో ఎనిమిది సినిమా స్క్రీన్స్ అందుబాటులోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒకే చోట షాపింగ్, భోజనం, సినిమా వినోదాన్ని ఆస్వాదించే అవకాశం కలగడంతో కుటుంబ ప్రేక్షకులకు ఇది మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ విశాఖ నగరంలోని సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.

 

బన్నీ రాకకు పోలీసుల పటిష్ట భద్రత

 

అల్లు అర్జున్ విశాఖకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విశాఖ నగర పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో డీసీపీ-1, ఏడీసీపీలు, ఏసీపీలు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. కార్యక్రమం జరిగే ప్రాంతంతో పాటు అల్లు అర్జున్ రాకపోకలు సాగించే మార్గాల్లోనూ పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఐలు, ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో విధుల్లో పాల్గొని భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, అభిమానుల రద్దీని క్రమబద్ధీకరించారు.

పోలీసుల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. అల్లు అర్జున్ రాకతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొనగా, పోలీసుల పటిష్ట భద్రతతో కార్యక్రమం సజావుగా సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి.విష్ణు కుమార్ రాజు, ఇనార్బిట్ మాల్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!