రాష్ట్రం

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్

ఆర్థిక ప్రయోజనాలు, కారుణ్య నియామకాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం

అనకాపల్లి, సెప్టెంబర్ 17: విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులతో ఎస్పీ గారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాధితుల సమస్యలను ఆయన ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వం నుంచి రావలసిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఫ్యామిలీ పెన్షన్ తదితర ఆర్థిక ప్రయోజనాలతో పాటు కారుణ్య నియామకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దస్త్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సాంకేతిక, రికార్డుపరమైన సమస్యలను వెంటనే సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

“విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది త్యాగాలు మరువలేనివి. వారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రథమ ప్రాధాన్యత. మీరంతా మా పోలీస్ కుటుంబ సభ్యులే. మీకు ఏ విధమైన సమస్యలు, ఇబ్బందులు ఉన్నా ఎలాంటి సంకోచం లేకుండా నేరుగా నన్ను కలవవచ్చు. శాఖాపరంగా అన్ని విధాలా మీకు అండగా ఉంటాం,” అని భరోసా ఇచ్చారు. ​ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, సీఐలు బాల సూర్యరావు, రామకృష్ణారావు, మన్మధరావు, కార్యాలయ పరిపాలనాధికారి (ఏవో) శ్రీ సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, ఎస్సై హరినాథ్ మరియు ఇతర పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!