రాజకీయాలువిశాఖపట్నం

ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తాం – మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్

ఉత్తరాంధ్ర హక్కుల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధం

విశాఖ రైల్వే జోన్‌ విషయంలో చంద్రబాబు ద్రోహం

:మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్‌ ధ్వజం

ఏప్రిల్ 11 శనివారం (టూ న్యూస్) :  వైయస్సార్‌సీపీ విశాఖ జిల్లా కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్‌.

  • విశాఖ హక్కుల పోరాటంలో జైలు శిక్ష నాకు గర్వకారణం
  • కేకే లైన్‌ను తరలిస్తున్నా పట్టించుకోని కూటమి నేతలు
  • అమరావతిపై ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్రాపై ఏది?
  • చంద్రబాబుకు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు పట్టవా?: అమర్‌నాథ్‌

విశాఖపట్నం రైల్వే జోన్‌ సాధన కోసం తాను చేసిన ప్రజా పోరాటంలో 6 నెలల జైలు శిక్ష పడటం ఉత్తరాంధ్ర ప్రజల పట్ల తనకున్న నిబద్ధతకు నిదర్శనమని, దీనిని తాను గర్వకారణంగా భావిస్తున్నానని వైయస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్‌ స్పష్టం చేశారు. 2016లో రైల్వే జోన్‌ కోసం తాను చేసిన దీక్షపై కోర్టు తీర్పును గౌరవిస్తూనే, ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు. వాల్తేరు డివిజన్‌లో అత్యధిక ఆదాయాన్నిచ్చే ‘కేకే లైన్‌’ను ఒడిశాలోని రాయఘడ డివిజన్‌లో కలుపుతుంటే, కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి మంత్రులు, ఎంపీలు నోరు మెదపక పోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. చంద్రబాబుకు అమరావతి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ మీద, భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ రోడ్డు మీద ఎందుకు లేదని నిలదీశారు.

జగన్‌ ప్రతిపాదించిన మావిగన్‌ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉత్తరాంధ్ర హక్కుల కోసం వైయస్సార్సీపీ పోరాటం ఆగదని విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్‌ తేల్చి చెప్పారు.

‘2016 ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి సాక్షిగా విశాఖ రైల్వే జోన్‌ కోసం నిరాహార దీక్ష చేపట్టాను. ఆనాడు టీడీపీ ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసులో గౌరవ న్యాయస్థానం 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇది ఈ ప్రాంత నిరుద్యోగ యువత కోసం, విశాఖ భవిష్యత్తు కోసం చేసిన పోరాటం. అవసరమైతే రైలు పట్టాలపై తల పెట్టి అయినా రైల్వే జోన్‌ సాధిస్తానని ఆ రోజే చెప్పాను. కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేస్తాం, కానీ విశాఖ హక్కుల కోసం పోరాటం మాత్రం ఆపేది లేదు.

వాల్తేరు డివిజన్‌ విభజన. కూటమి ప్రభుత్వం చేతగానితనం: 

దేశంలోనే అత్యధిక గూడ్స్‌ రెవెన్యూ ఇచ్చే వాల్తేరు డివిజన్‌లోని కేకే లైన్‌ (కొత్తవలస–కిరండోల్‌) ను కొత్తగా ఏర్పడే సౌత్‌ కోస్ట్‌ జోన్‌ నుంచి తొలగించి, ఒడిశాలోని రాయఘడ డివిజన్‌లో కలపడం ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న కూటమి మంత్రులు, ఎంపీలు దద్దమ్మల్లా ఎందుకు కూర్చున్నారు? ఈ జోన్‌ పరిధిలోకి ఏడు రైల్వే స్టేషన్లు తెచ్చామని గర్వంగా కేంద్ర మంత్రి చెప్పుకోవడం కాదు సిగ్గుచేటు. దమ్ముంటే అధిక ఆదాయాన్నిచ్చే కేకే లైన్‌ విశాఖ జోన్‌లోనే ఉండేలా సాధించండి. అమరావతి గెజిట్‌ కోసం కాళ్లు పట్టుకునే చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రయోజనాలు పట్టవా? ఇప్పటికైనా విశాఖ డివిజన్‌లోనే కేకే లైన్‌ ఉంచేలా కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

అమరావతి మీద ప్రేమ.. మిగిలిన ప్రాంతాలపై కక్ష:

చంద్రబాబు మనస్తత్వం కేవలం 29 గ్రామాలకే పరిమితమైంది. ఎంతసేపూ ఆయన దృష్టంతా అక్కడి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపైనే. ఆ పనుల్లో దోపిడిపైనే. ‘పిడుగు పడినా అమరావతిలోనే పడాలన్నట్టు బాబు వైఖరి తయారైంది. అందుకే ప్లాన్‌–బీగా జగన్‌ సూచించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరుతో కూడిన మావిగన్‌ను ప్రజలు స్వాగతిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారు. మచిలీపట్నం విజయవాడ గుంటూరు అంటే అమరావతి కూడా అందులో భాగమే. అమరావతి వద్దు అన్న మాటను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ చెప్పలేరు. ఈ మూడింటిని కలిపి ఆలోచన చేయమని అడిగితే, తమకు అమరావతి మాత్రమే కావాలని చెబుతున్నారు.

మావిగన్‌ మీద ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యే సరికి చంద్రబాబు మాట మార్చారు. ఇప్పుడు కారిడార్‌ లంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయినా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నోరు మెదపరు. 7 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపుపై స్పందించరు.

భోగాపురం ఎయిర్‌పోర్టుకు దారేది?ఇంకా ఏ పనులూ లేవు: 

జగన్‌ హయాంలో శరవేగంగా జరిగిన అభివృద్ధి పనులను ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. మరో 3 నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు సిద్ధం కాబోతోంది. కానీ దానికి కనెక్టివిటీ ఇచ్చే కోస్టల్‌ కారిడార్‌ను మీరు సముద్రంలో కలిపేశారు.

ఇంకా మచిలీపట్నం పోర్టు పనులను నిలిపివేశారు. పోలవరం ఎత్తును 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు కుదిస్తుంటే చేతులు కట్టుకుని చూస్తున్నారు. మరోవైపు రాజధాని విషయంలో మీ తీరు వల్ల అమరావతి భవిష్యత్తులో మలేషియాలోని ’పుత్రజయ’ లాగా ’ఘోస్ట్‌ సిటీ’ గా మారడం ఖాయం. గతంలో సింగపూర్, మలేషియా అని చంద్రబాబు చెప్పేవాడు. ఆ మలేషియా రాజధాని కౌలాలంపూర్‌. దానికి పుత్రజయ అనే కొత్త రాజధాని కడితే అది ఘోస్ట్‌ క్యాపిటల్‌ గా మిగిలింది. రేపు అమరావతికి అదే పరిస్ధితి వస్తుందన్న భయం రాష్ట్ర ప్రజలందరికీ ఉంది అని అన్నారు.

కాగా, మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. షర్మిల తీరు చూస్తుంటే కాంగ్రెస్‌ భావజాలం కంటే బాబు సారూప్యత భావజాలంతోనే పని చేస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారమే ఆమె మాట్లాడుతున్నారని, ఆయనకు రాజకీయంగా ఇబ్బంది కలిగినప్పుడల్లా ఆమె బయటకు వచ్చి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని గుడివాడ అమర్‌నాథ్‌ ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యురాలు వరుదు కల్యాణి , సమన్వయకర్తలు మొల్లి అప్పారావు , మాజీ శాసనసభ్యులు తైనాల విజయకుమార్ , చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!