విశాఖపట్నం

పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద బారులు సాయంత్రం నుంచి రేషన్‌ విధానం అమలు బైక్‌కు 2, కార్లకు 15, భారీ వాహనాలకు 50 లీటర్ల పెట్రోల్‌/డీజిల్‌ పుష్కలంగా నిల్వలున్నాయంటున్న పౌర సరఫరాల అధికారులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 27 ( ట్రూ న్యూస్) : పెట్రోల్‌, డీజిల్‌ కోసం సోమవారం వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచి రాత్రి వరకు గంటలకొద్దీ వేచి ఉన్నారు. డిమాండ్‌కు సరిపడనంత పెట్రోల్‌, డీజిల్‌ను బంక్‌లకు రెండు, మూడు రోజులుగా ఆయిల్‌ కంపెనీలు సరఫరా చేయడం లేదు. ఐవోసీ బంకులకు కొద్దిరోజులుగా నుంచి రెండు రోజులకు 10 కిలోలీటర్ల డీజిల్‌, 10 కిలోలీటర్ల పెట్రోల్‌ సరఫరా చేస్తూ రేషన్‌ విధించారు. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ బంకుల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నా బయటకు చెప్పడం లేదు. దీంతో పలుచోట్ల బంకులు మూతపడుతున్నాయి. రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయన్న వార్తలతో సోమవారం ఉదయం అన్ని బంకుల వద్ద వాహనదారులు క్యూకట్టారు. కాగా బైక్‌కు రెండు లీటర్లు, కారుకు 15 లీటర్లు, భారీ వాహనాలకు 50 లీటర్ల పెట్రోల్‌/డీజిల్‌ ఇవ్వాలని సాయంత్రం పైనుంచి ఆదేశాలు అందినట్టు చెబుతున్నారు. జిల్లాలోని 120 పెట్రోల్‌ బంకుల్లో సోమవారం ఉదయానికి 1,860 కిలోలీటర్ల పెట్రోల్‌ ఉండగా, సాయంత్రం ఆరు గంటల వరకు 424 కిలోలీటర్లు విక్రయించారు. అలాగే 118 డీజిల్‌ బంకుల్లో 2,118 కిలోలీటర్లు నిల్వ ఉండగా సాయంత్రం ఆరు గంటల వరకు 401 కిలో లీటర్లు విక్రయించామని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కరరావు తెలిపారు. బంకుల్లో నిల్వలు ఉన్నాయని, అయితే అవసరమైన మేరకు మాత్రమే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేయాలని కోరారు.

పెట్రోల్‌బంకుల పరిసరాల్లో ట్రాఫిక్‌ జామ్‌

పెట్రోల్‌ బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరడంతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద జాతీయ రహదారిని అనుకుని ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌బంకుకి భారీగా కార్లు, ద్విచక్ర వాహనాలు పోటెత్తడంతో శంకరమఠం కూడలి వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. అలాగే స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం, అప్పుఘర్‌ ప్రాంతాల్లోని పెట్రోల్‌బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!