
విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష హోంమంత్రి అనిత కార్యకర్తల మనోభావాలకు భంగం కలిగితే చర్యలు తప్పవునక్కపల్లి, జూన్ 1 : విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని, దాని ఏర్పాటు దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నక్కపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఆంధ్రుల హక్కు అని పేర్కొన్న హోంమంత్రి, దీనికోసం టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో నిరంతరం పోరాటం చేశారని తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైల్వే జోన్ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని, కేసుల రాజకీయాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్లమెంట్ సభ్యుల చొరవతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రక్రియ వేగం పుంజుకుందని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రైల్వే జోన్ కోసం అవసరమైన 50 ఎకరాల భూమిని కూడా కేటాయించలేదని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకోవాల్సిన సందర్భమిదని హోంమంత్రి అన్నారు. రైల్వే జోన్ ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడటమే కాకుండా ప్రత్యక్ష, పరోక్ష రంగాల్లో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని, ప్రముఖ సంస్థలు కూడా ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. గూగుల్ వంటి సంస్థ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వలస వచ్చే పరిస్థితులు ఏర్పడతాయని, ఉద్యోగ అవకాశాలు కల్పించే కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తల అంశంపై స్పందించిన హోంమంత్రి అనిత, కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంటుందని, టీడీపీకి కార్యకర్తలే అసలైన అధినేతలని అన్నారు. కార్యకర్తల మాట తమకు శిరోధార్యమని పేర్కొంటూ,సీఐ విషయంలో సోషల్ మీడియాలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయనే అంశాన్ని గమనించానని చెప్పారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



