విశాఖలో నాగరిక సమాజం తలదించుకునే ఘాతుకం: ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన నేవీ ఉద్యోగి! పెళ్లి చేసుకోమన్నందుకే కిరాతకం.. నిన్న రాత్రి లొంగిపోయిన నిందితుడు.. గజవాకలో కలకలం

మార్చి 29 ఆదివారం: గాజువాక…విశాఖ నగరంలో మరో ‘శ్రద్ధా వాకర్’ తరహా ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన భయంకర ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గాజువాక సమీపంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడు చింతాడ రవీంద్ర (35) ఇండియన్ నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక (29) అనే మహిళతో అతనికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని లేదా తనకు భారీగా డబ్బు సెటిల్ చేయాలని మౌనిక రవీంద్రపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది.
రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, గత వారం మౌనికను తన నివాసమైన ఎల్.వి. నగర్‌కు పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో రవీంద్ర ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తన ఇంట్లోని డబుల్ డోర్ ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. శరీరం నుంచి వచ్చే దుర్వాసన బయటకు రాకుండా గదిలో సెెంట్ స్ప్రేలు చల్లుతూ ఐదు రోజుల పాటు ఏమీ తెలియనట్లుగా అక్కడే గడిపాడు.
మృతదేహాన్ని పూర్తిగా మాయం చేయడం సాధ్యం కాదని గ్రహించిన రవీంద్ర, తన పాపం పండుతుందన్న భయంతో నిన్న (ఆదివారం) రాత్రి నేరుగా మల్కాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను తన ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో పెట్టానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా, ఫ్రిజ్‌లో కుళ్ళిన స్థితిలో ఉన్న శరీర భాగాలు లభ్యమయ్యాయి.
మౌనిక తల మరియు చేతులను నిందితుడు నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో పారవేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఈరోజు ఉదయం నుంచి పోలీసులు నిందితుడిని వెంటబెట్టుకుని ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
ఈ ఘటనపై నేవీ ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు.
వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయి, ప్రాణాలు ఎలా పోతున్నాయనే దానికి ఈ ఘటన ఒక పరాకాష్టగా నిలిచింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు ,జరుపుతున్నారు.




