మతం

మేరాజ్ కానుక నమాజ్

జనవరి 16 శుక్రవారం షబే మేరాజ్ సందర్బంగా ప్రత్యేక కథనం

దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారి జీవితంలో జరిగిన అనేక ముఖ్య సంఘటనల్లో ‘ మేరాజ్ ‘ కూడా ఒకటి. ముస్లిం సమాజంలో దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. అరబీ భాషలో మేరాజ్ అంటే నిచ్చెన అని అర్ధం. మక్కానుండి, బైతుల్ మఖ్దిస్ వరకు బుర్రాఖ్ ప్రయాణం ముగిసిన తరువాత దైవప్రవక్త ముహమ్మద్ (స) నిచ్చెన మార్గం ద్వారా ఆకాశ ప్రయాణం చేశారు. అందుకే దీనికి ‘మేరాజ్ ‘అని పేరొచ్చింది. ఈ మేరాజ్ యాత్రలో దైవం ఆయనకు 50 పూటల నమాజుతో పాటు, బఖర సూరాలోని చివరి ఆయతులు, పాపక్షమాపణకు సంబంధించిన శుభవార్తను కానుకగా బహూకరించాడు. ప్రవక్త మహనీయులు మహదానందంతో తిరిగొస్తుండగా, హజ్రత్ మూసా అలైహిస్సలాం తారసపడి, సంతోషానికి కారణమేమిటని అడిగారు. ప్రవక్త మహనీయులు పరమ సంతోషంతో కానుకల గురించి వివరించారు. అప్పుడు హజ్రత్ మూసా(అ) ‘ మీ అనుచరులు 50 పూటల నమాజును ఆచరించలేరు. మీరు వెనక్కివెళ్ళి ఈసంఖ్యను తగ్గించుకురండి.’ అని సలహా ఇచ్చారు. దీంతో ముహమ్మద్ ప్రవక్త(స) దేవుని వద్దకు వెళ్ళి నమాజుల సంఖ్యను తగ్గించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు దైవం కొన్ని నమాజులను తగ్గించాడు. అయినా హజ్రత్ మూసా(అ), ‘ మీ అనుయాయులు ఇవికూడా చెయ్యలేరు, ఇంకా తగ్గించుకు రండి.’ అని చెప్పారు. ఈవిధంగా ముహమ్మద్ ప్రవక్త వెళ్ళి తగ్గించుకురావడం, మూసా ప్రవక్త ఇవికూడా ఎక్కువే ఇంకా తగ్గించుకురండి అని వెనక్కి పంపడం జరిగి, చివరికి ఐదు నమాజులు మిగిలాయి. అయినా మూసా అలైహిస్సలాం ఇంకా తగ్గించుకు రమ్మన్నారు. కాని ప్రవక్త మహనీయులు ‘ఇకనేను వెళ్ళలేను. ఇప్పటికే చాలాసార్లు వెళ్ళితగ్గించుకొని వచ్చాను. మళ్ళీ వెళ్ళడానికి నాకు సిగ్గుగా ఉంది. ఈ ఐదు నమాజులు నాకు సమ్మతమే, సంతోషమే.’ అన్నారు. అప్పుడు,’ ఎవరైతే ఈ ఐదు నమాజులు సక్రమంగా నెరవేరుస్తారో వారికి 50 పూటలు నమాజు ఆచరించినంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది’ అన్న శుభవార్త వెలువడింది. ఈ సప్తాకాశాల పర్యటనలో ముహమ్మద్ ప్రవక్త (స) ఇంకా అనేక సంఘటనలు, విశేషాలను వీక్షించారు. ఒకచోట కొందరు వ్యక్తులు ఒక పంటను కోస్తున్నారు. అయితే ఆపంట కోస్తున్నకొద్దీ తరగడం కాకుండా పెరగడం చూసి, ‘ ఏమిటీవింత?’ అని జిబ్రీల్ అలైహిస్సలాంను అడిగారు.’ వీరు దైవ మార్గంలో తమ సర్వస్వాన్నీ త్యాగం చేసినవారు.’ అని చెప్పారు హజ్రత్ జిబ్రీల్. మరొకచోట కొందరు వ్యక్తులు అతుకుల బొంతలు ధరించి పశువుల్లాగా గడ్డి మేస్తున్నారు. ఇదిచూసిన ప్రవక్త(స) వీరెవరని ప్రశ్నించారు. ‘ వీరుతమ సంపదనుండి జకాత్ (పేదలకు చెందాల్సిన ఆర్థికదానం) చెల్లించని వారు.’ అని చెప్పారు.
ఇంకొకచోట కొందరి తలలను బండరాళ్ళతో చితగ్గొట్టడం జరుగుతోంది. ఈదృశ్యాన్నిచూసి, ‘మరివీళ్ళెవరు?’ అని ప్రశ్నించారు ప్రవక్తమహనీయులు.’ వీరు నిద్రమత్తులో జోగుతూ దైవారాధనకు బద్దకించేవారు.’ అని సమాధానం చెప్పారు జిబ్రీల్ .
మరొకచోట ఒక మనిషి కట్టెలమోపు ఎత్తడానికి విఫలయత్నాలుచేస్తూ, అందులోంచి కొన్ని కట్టెలు తీసి తేలిక పరుచుకునే బదులు, అదనంగా మరికొన్ని కలిపి మోపు కడుతున్నాడు. ముహమ్మద్ ప్రవక్త(స) ఈ వింతనుచూసి,’ ఈ మూర్ఖుడెవరు?’ అని అడిగారు.’ ఈవ్యక్తి శక్తికి మించిన బాధ్యతలు మీదేసుకొనికూడా, వాటిని తగ్గించుకునే బదులు మరికొన్ని బాధ్యతలు భుజాన వేసుకునేవాడు.’ అని బదులిచ్చారు హజ్రత్ జిబ్రీల్ .
అలాగే మరొకచోట కొందరు వ్యక్తుల పెదవులు, నాలుకలు కత్తెర్లతో కత్తిరించ బడుతున్నాయి. ఇది చూసిన ప్రవక్త వారు, ‘ ఇదేమిటీ? ‘ అని ప్రశ్నించారు.’ వీరు బాధ్యత మరచిన ఉపన్యాసకులు.
బాధ్యతారహిత ప్రసంగాలతో ప్రజల్ని రెచ్చగొట్టి చిచ్చుపెట్టేవారు, వారిమధ్య కలహాలు రేకెత్తించేవారు.’ అన్నారు జిబ్రీల్ . ఇదేవిధంగా ఇంకోచోట, బండరాయికి ఒక సన్నని పగులు ఏర్పడి, అందులోంచి బాగా బలిసిన ఒక వృషభం బయటికొచ్చింది. అయితే అది మళ్ళీ ఆ సన్నని పగులు లో దూరడానికి ప్రయత్నిస్తోంది, కాని విఫలమవుతోంది. ఇది చూసిన ప్రవక్త మహనీయులు ‘మరి ఈవ్యవహారం ఏమిటి?’ అని ప్రశ్నించారు ప్రవక్త(స). దానికి జిబ్రీల్ దూత,’ ఇది బాధ్యతారహితంగా, సమాజంలో కల్లోలం రేకెత్తే విధంగా మాట్లాడి, తరువాత పశ్చాత్తాపం చెందే వ్యక్తికి సంబంధించిన దృష్టాంతం.’ అని చెప్పారు. కొందరు వ్యక్తులు అనాలోచితంగా మాట్లాడి, తరువాత సరిదిద్దుకోడానికి, లేక ఆ మాటను ఉపసంహరించుకోడానికి ప్రయత్నిస్తారు. కాని నోరుజారిన తరువాత ఇక అది సాధ్యంకాదు కదా! మరోచోట, కొందరు స్వయంగా తమ శరీర భాగాలను కోసుకొని తింటున్నారు. ‘ మరి వీరెవరూ? ‘ అని ప్రశ్నించారు ప్రవక్త(స). ‘ వీరు ఇతరులను ఎగతాళి చేసేవారు, అవమానించేవారు, సాటి మనుషుల్ని తక్కువగా చూసేవారు.’ అని చెప్పారు జిబ్రీల్ . అలాగే రకరకాల శిక్షలు అనుభవించేవారు కనిపించారు. ఇతరులపై నిందలు వేసేవారు తమ రాగి గోళ్ళతో ముఖాలపై, ఎద రొమ్ములపై రక్కుకుంటున్నారు. వడ్డీ తినేవారు, అనాధల సొమ్ముకాజేసేవారు, అవినీతి అక్రమాలకు పాల్పడేవారు, జూదం, మద్యం, వ్యభిచారం లాంటి దుర్మార్గాల్లో కూరుకుపోయినవారు రకరకాల శిక్షలు అనుభవిస్తూ కనిపించారు. ఎవరైతే దైవాదేశాలకనుగుణంగా ప్రవక్త వారు చూపిన బాటలో నడుచుకుంటూ, మంచి పనులు చేస్తారో అలాంటివాళ్ళే ఈ భయంకరమైన శిక్షలనుండి సురక్షితంగా ఉండగలుగుతారు. దైవం మనందరినీ తనకిష్టమైన మార్గంలో జీవితం గడిపే సద్భుధ్ధిని ప్రసాదించి, భయంకరమైన శిక్షలనుండి కాపాడాలని కోరుకుందాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!